-->

Billboard Ads

గుండెలో గుండె దడ!

లాస్ట్ వీక్ " 'పొన్నాడ ' వారి ' పున్నాగ వనం" గ్రూప్ లొ ఇచ్చిన, టాపిక్ "యాత్ర లో హాస్యం" కు నేను రాసిన కథ "గుండెలో గుండె దడ."

"మీరసలు వచ్చినట్లే లేదు. లింగడు రానూ వచ్చాడు, పోనూ పోయాడు అన్నట్లు చేస్తారు." అని అలేఖ్య గొణుగుతుంటే , "అందుకే అమ్మా మిమ్మలిని రమ్మనేది. మీరొస్తే హాపీగా అక్క దగ్గర మూడునెలలు, నా దగ్గర మూడు నెలలు ఉండి మనవళ్ళు, మనవరాళ్ళతో ఎంజాయ్ చేయవచ్చు."అన్నాడు దీపక్.

"నాకూ రావాలనే ఉంటుందిరా. మీ డాడీ కూడా అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తారు. అంతా బాగానే ఉంటుంది కాని , మధ్యలో ప్రయాణమే ఉంది చూసావూ, మీ డాడీ విన్యాసాలతో, ఎప్పు డెవరికి ఏ ఆపద వస్తుందో, ఎందులో ఈ అభిరాముడుగారు  ఆపత్బాంధవుడిలా దూరిపోతారో  అని గుండెలో గుండె దడ పుట్టిస్తుంది." అని వాపోయింది.

" అంతా నీ భయమే కానీ డాడీ మరీ అంత ఓవర్ గా ఏమీ చేయరు. ఐనా ఈ సారి కాస్త గట్టిగా చెపుతానులే." అని కొడుకు అభయమిచ్చి టికెట్స్ బుక్ చేసాడు.

మనవళ్ళతో కొన్ని రోజులు గడపాలనే కోరిక చంపుకోలేక , " అభీ ప్లీజ్ ప్లీజ్  ఏర్ పోర్ట్ లల్లో ఏ సాహసమూ చేయకండీ. ఏదీ పట్టించుకోకండీ. ఎవరి కి వాళ్ళు వాళ్ళ సంగతి చూసుకోగలరు. అక్కడ గార్డ్ లు కూడా ఉంటారు కదా.  కావాలంటే అక్కడికెళ్ళాక చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ " అని  మొగుడిని బతిమిలాడుకుంటూ విమానం ఎక్కి , హాంగ్ కాంగ్ లో పతీసమేతంగా దిగింది. అమ్మయ్య ఇక్కడి వరకు సేఫ్ . ఇక్కడ ఉండే ఎనిమిది గంటలు అభిని కనిపెట్టుకొని ఉంటే  చాలు, లేకపోతే ఎవరికో ఏదో అవసరం వచ్చిందని సిరికిన్ చెప్పడు అన్నట్లు బుర్రున ఉరుకుతాడు  అనుకొని, " ఏమండీ ఇక్కడే వుంటారుగా . నేనిప్పుడే వాష్ రూం కు వెళ్ళి వస్తాను." అని అడిగింది.

"అబ్బా పిచ్చిపోరిలా చేయకు. ఇక్కడుండకుండా  ఎక్కడికెళుతాను." విసుక్కున్నాడు అభిరాం.

ఐనా అనుమానంగా చూస్తూనే వెళ్ళింది. వాష్ రూం నుంచి హడావిడిగా వచ్చేస్తుంటే కాలు జారి పడబోయింది. అక్కడే ఉన్న హెల్పర్ ఓ ముసలావిడ పట్టుకొని ఆపింది. ఓ థాంక్స్ ఆమెకు చెప్పేసి రాబోతుంటే చేయి పట్టుకొని ఆపి కిందపడ్డ హాండ్ కర్చీఫ్ తీసి ఇచ్చింది. పాపం ఏదో అడుగుతుంటే , నీ భాష నా కర్ధం కావటము లేదు తల్లీ,  హాండ్ కర్చీఫ్ కంటే ముఖ్యమైనది తప్పిపోకుండా చూసుకోవాలి నన్ను వదిలేయ్ తల్లీ అని మనసులో అనుకొని , ఆమెకో దండం పారేసి పరిగెత్తి , బాగ్ ల అ దగ్గర నిలబడి దిక్కులు చూస్తున్న అభిని చూసి అమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది! అభిరాం కూడా వెళ్ళి వచ్చాక ఫుడ్ కోర్ట్స్ వైపు నడిచి, ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నారు. "ఏమైనా తిందామా?" అడిగాడు. పోయినసారి వచ్చినప్పుడు ఏర్ పోర్ట్ లల్లో వెజిటేరియన్స్ ఏమి తినవచ్చో, అందులో ఏమేమి వేయాలని అడగాలో , మనవరాలితో రాయించుకొచ్చిన  డైరీని తీసి చూస్తూ " ఏం తింటావు " అడిగాడు.

"బర్గర్స్ తిందాము. అందులో ఐతే కూరగాయలు, బన్ ఉంటుంది కాబట్టి కడుపు నిండి, మనకు ఫ్లైట్ లో ఏమైనా తినినేందుకు ఇచ్చేవరకూ ఆకలివేయకుండా ఉంటుంది." అని జవాబిచ్చింది.

ఇద్దరూ బర్గర్స్ తిన్నాక ప్లేట్ లు ఇచ్చేసి , పేమెంట్ చేసి వస్తానని వెళ్ళాడు. సోఫార్ సో గుడ్! అనుకుంటూ అందరినీ చూస్తూ టైం పాస్ చేస్తోంది అలేఖ్య. సడన్ గా అరే ఏరీ ఈయన? వెళ్ళి చాలా సేపైంది. బిల్ల్ ఇచ్చి వస్తానని వెళ్ళారు. ఎంతసేపైనా రారు. బిల్ కౌంటర్ దగ్గర లేరు. ఎక్కడి కెళ్ళారు ? రెస్ట్ రూం కనుకుందామనుకుంటే ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చింది.వెతకటానికి ఎక్కడికని వెళ్ళను? పైగా రెండు బాగులు, రెండు హాండ్ బాగులూ పట్టుకొని ఎట్లా పోను. దేవుడా .గుండె దడదడాలాడుతుండా ఆంజనేయస్వామిని తలుచుకుంటూ, కూర్చుంది. దాదాపు గంట తరువాత వచ్చాడు. ఏమీ మాట్లా కుండా అభిరాం వైపు చూసింది.

"ఏమిటి అట్లా చూస్తున్నావు? నీకన్నిటికీ టెన్షనే. షాప్ వాడు చేంజ్ ఫైవ్ చైనీస్ రూపీస్ ఇచ్చాడు. అదేమి చేసుకుంటాము మారుద్దామని అన్ని షాప్ లు తిరిగి ఒక చోట బబుల్ గం పాకెట్ కొన్నాను. పద అటెళ్ళి లాంజ్ లో కూర్చుందాము." అన్నాడు తాఫీగా బబుల్ గం నములుతూ.

ఇంకేమంటుంది పదండి అని లేచింది.

ఇంకా ఐదు గంటలు గడవాలి, అమ్మో ఇట్లా వదిలేస్తే లాభం లేదు అనుకొని, ఏమి చేస్తే బాగుంటుందా అని చుట్టూ చూసింది. లాంజ్ లో చేర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ చోట ప్లగ్ పాయింట్ కనిపించింది.అమ్మయ్య , అభీ అటు కూర్చుందామా అని అటు తీసుకెళ్ళి , అభిరాం  ఐపాడ్ బాగ్ లోనించి తీసి ఇచ్చింది. ప్లగ్ పాయింట్ లో సెట్ చేసుకొని  ఐపాడ్ తీసి బ్రిడ్జ్ ఓపెన్ చేసాడు... అమ్మయ్య ఇంక పరవాలేదు, శ్రీలక్ష్మిలాగా గంట కట్టక పోయినా ఐపాడ్తో కట్టేసాను అని ఊపిరి పీల్చుకొని, తన  బాగ్ ఓపెన్ చేసి, లాప్ టాప్ తీసి, ఈ నెల రెవ్యూ రాద్దామని ఉంచుకున్న నవల కోసం చూస్తే కనిపించలేదు. చదువుదామని పెట్టుకున్న ఆంధ్రభూమీ కనిపించలేదు. ఈ సారి రెండు రోజులముందే అన్నీ సద్దుకున్నాను. లాస్ట్ మినిట్ లో అభీ అన్నీ అటూ ఇటూ చేసారు అనుకుంటూ నా బుక్స్ తీసారా అంటే ఏమో అన్నారు తల ఎత్తకుండానే. ఓసారి అభిరాం ను చూసి నిట్టూరుస్తూ కాసేపు స్పైడర్ ఆడింది.  స్పైడర్ ఆడి విసుగొచ్చి, ఓ కన్ను అభి మీదనే ఉంచి, ఇంకో కన్ను తో ఎదురుగా ఉన్న ట్రాలీలను, ఎన్ని తెచ్చి పెడుతున్నారు, ఎన్ని తీసుకుపోతున్నారు లెక్క పెడుతూ, కిందనుంచి వెళుతున్న ట్రేన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి చూసుకుంటూ, లాంజ్ లో వచ్చేపోయేవాళ్ళను చూస్తూ, ఎదురు బోర్డ్ మీద  ఫ్లైట్ ఎన్నింటికి, ఏ గేట్ దగ్గరకు వస్తుంది వేసారా చూసుకుంటూ, ఒక కన్ను తో చూడటము కష్టమే ఐనా ఎట్లాగో మానేజ్  చేస్తూ టైం పాస్ చేయగా చేయగా భారంగా ఐదు గంటలు గడిచాయి. మొత్తానికి 3rD గేట్ దగ్గరకు వస్తుందని వేసారు. పదండి పదండి, మనము 35 నుంచి 3 కు వెళ్ళాలి అని అభీనీ  లేపింది. అమ్మయ్య ఈ సారి ఐపాడ్ కరుణించింది!

అక్షరాలా లక్ష రూపాయలు తీసుకుంటారు టికెట్ కు కాని ఆ సీట్లు ఎంత ఇరుకో.అటూ ఇటూ మెసిలేందుకే ఉండదు. కాకపోతే జేన్ ఫుడ్ అని చెప్పారు  కాబట్టి భోజనం బాగానే ఉంది. విమానం లో  ఏ సాహసమూ చేసే అవసరం ఉండదు కాబట్టి  అభి సంగతి వదిలేసి హాయిగా తినటం, నిద్రపోవటమే! 12 గంటల సుధీర్ఘ ప్రయాణం తరువాత శాంఫ్రాన్సిస్కో చేరారు.